Friday, May 20, 2011

రాధ-మధు

ఒకరోజు ఊరికెనే youtubeలో ఏదో వెతుకుతుంటే "రాధ-మధు" ధారావాహికలో ఒక అంకం (episode) ఎదురైంది. చూస్తే Maa TV వాళ్ళు ఆ ధారావాహికనంతా high resolutionలో youtube లో ఉంచారు. సరే అని ఆ అంకాన్ని నొక్కి చూస్తే ఎందుకో నచ్చింది. అలాగ నెమ్మదిగా అంకం తరువాత అంకం పూర్తి చేసుకుంటూ మొత్తానికి ఆ ధారావాహికను రెండు నెలలు తిరక్కుండా పూర్తిగా చూసేశాను (450 అంకాలు). ఒక్క ముక్కలో చెప్పలంటే అద్భుతంగా ఉంది. ఈ ధారావాహికలో నాకు నచ్చిన కొన్ని అంశాలను ప్రస్తావిస్తే ఆ విశేషాలు నచ్చినవారు కూడా ఈ ధారావాహికని చూసి సంతోషిస్తారని ఈ టప వ్రాస్తున్నాను. చదువర్లు గమనించాల్సిన విషయం ఏమిటంటే రాధ పూర్తి పేరు రాధాకృష్ణ, మధు పూర్తి పేరు మధూళిక.
  • బలమైన స్త్రీపాత్రలు: రాజరాజేశ్వరి, మధూలిక, జానకమ్మ (రాధారాణి) ముఖ్యపాత్రలు కావడంతో వాటికి బరువుని కల్పించడం సహజం. కానీ అక్కడక్కడ కనబడే పాత్రలను కూడా చాలా చక్కగా రూపించారు. ఉదాహరణలు:
    • జూలూ, రాధ class కి ఎందుకు రావట్లేదో కనుక్కోమని తన friend ని అడుగుతుంది. ఆ friend కి పట్టుమని పది సన్నివేశాలు కూడా ఉండవు. కానీ, ఎంతో పరిపక్వతను కనబరుస్తుంది. ఆమె చెప్పే నాలుగు మాటల్లో కూడా చాలా అనుభవం కనబడుతుంది.
    • గోదావరి (రాధ వాళ్ళింట్లో పనిమనిషి) రెండు మూడు సార్లు రాధను ఎదిరించి మంచి చెప్తుంది. ఆ చెప్పటంలో కూడా ఆవేశం కంటే ఆవేదన ఎక్కువగా కనిపిస్తుంది. ఆ పాత్ర చాలా చక్కగా అల్లారు.
  • సున్నితత్వం ఉన్న పాత్రలు: దాదాపు అన్ని పాత్రలలోనూ సున్నితత్వాన్ని చూపించారు (బహుశా, మూర్తి తల్లి పాత్ర తప్ప). రెండు మాటల్లో ఎంతో లోతును ప్రదర్శించే అవకాశం దాదాపు అన్ని పాత్రలకూ లభించింది. ఉదాహరణలు:
    • మధూలిక రాధను విడిచి వెళ్ళిపోయే ముందు (అతనికి తెలియదు వెళ్ళిపోతోంది అని) చక్కగా వండి కొసరికొసరి వడ్డించి వెళ్ళిపోతుంది. అది చాలా బాగా అనిపించింది నాకు. 
    • రాధ అత్యవసరమైన పనిని తన ఉద్యోగికి చెప్పి, "నాకు lunch time లోపల పని జరగాలి", అంటాడు. ఆ ఉద్యోగి వెళ్తూంటే, "చూడండి, మీరు lunch రోజూ చేసే time కే చెయ్యండి", అంటాడు. ఇందులో శ్లేషతో కూడిన హాస్యం కలిగే అవకాశమున్నా, రాధ కళ్ళల్లో ఆ సున్నితత్వం కనిపించి సన్నివేశాన్ని పండించింది. ఇలాంటి సన్నివేశాలు ఎన్నో చూస్తుంటే ఈ తిట్టుకోవాడాలు, కొట్టుకోవడాలు ఉన్న చలనచిత్రాల కంటే ఈ ధారావాహికల్లోనే మనసుకు కాస్త ఊరట కలుగుతుంది అనిపించింది.
  • చక్కని మాటలు: మాటల రచయిత ఎవరో తెలియదు కానీ, మంచి హాస్యాన్ని, పదాల వాడుకలో మెళకువని, మనసుని స్పృశించే భావావేశాన్ని కనబరిచాడు. దాదాపు ప్రతి రెండు అంకాలకు ఒకసారి "హమ్మ, భలే మాట వాడాడురా" అనిపించింది. మచ్చుకు మూడు చెప్తున్నాను.
    • ఒక కార్మికనాయకుడు ఆ కర్మాగారానికి managerతో మాట్లాడే సందర్భంలో, "మీరేం చేసినా చూస్తూ ఊరుకోవడానికి మేమేమి గాజులు తొడుక్కుని కూర్చోలేదు" అంటాడు. వెంటనే ఆ manager, "మన factoryలో గాజులు తొడుక్కుని పని చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళను అవమానించడం దేనికి? విషయం చెప్పండి.", అంటాడు. ఆ సన్నివేశానికి ఆ మాట వలన ఎంతో అందం చేకూరింది.
    • మిత్రా రాధను వెక్కిరిస్తూ, "ఆరంభించకుండా ఆగిపోయేవాడిని అధముడు అని, ఆరంభించి మధ్యలో వదిలేసేవాడిని మధ్యముడు అని, ఆరంభించిన పనిని పూర్తిచేసేవాడిని ఉత్తముడు అని అంటారు" (భర్తృహరి సుభాషితం), అంటాడు. రాధకు చాలా కోపం వచ్చి, "ఆరంభించక ముందే అపశకునం పలికేవాణ్ణి 'వాయి మూడు' అంటారు", అంటాడు. రచయత భాషాచాతుర్యాన్ని ప్రదర్శించడంతో చక్కని హాస్యం పండింది. ఇలాంటి హాస్యం ఇంకా చలా చోట్ల ఉంది.
    • మూర్తి మధూళికతో మాట్లాడుతూ రాధ దగ్గరనుండి భరణం అడగమని అంటాడు. ఇన్నాళ్ళు తను రాధ కుటుంబానికి చేసిన సేవకు ప్రతిఫలంగా అడగడంలో తప్పులేదని, అందులో గౌరవం పోయేదేమీ లేదని అంటాడు. అప్పుడు మధూ, "ఎవరు నన్ను గౌరవించినా గౌరవించకపోయినా, నన్ను నేను గౌరవించుకోవాలి కద మూర్తి", అంటుంది. ఆత్మగౌరవాన్ని ఇంత చిన్న మాటల్లో చెప్పడం నాకు బాగా నచ్చింది.
  • రాజేశ్వరి, మిత్ర, గోపాలం -- వీరి స్నేహం: ముగ్గురికి ముగ్గురు ఎంతో మానసికపరిపక్వత కలిగినవాళ్ళయ్యుండి కూడా చిన్నపిల్లల్లాగా మాట్లాడుతూ వృద్ధాప్యం మనిషిలో ఉల్లాసానికి అడ్డు కాదు సుమీ అనిపిస్తారు. పెద్దరికం ఎంత కనబరుస్తారో, మాటలు అంత తేలికగా ఉంచుతారు.
  • తెలుగుదనం: ఎక్కడా మాటల్లో అతిగా ఆంగ్లాన్ని వాడలేదు. వాడినా అది information కోసమే వాడారు. ఉదాహరణకి నాకు french leave అంటే ఏమిటో ఈ ధారావాహిక ద్వారానే తెలిసింది. అక్కడక్కడ శతకపద్యాలను, మంచి సామెతలను గుర్తుచేశారు. మామూలు సన్నివేశాలలో "మార్దవం" లాంటి పదాలను వింటే మనసు పొంగిపోయింది. ఒక చోట బాపి, "మూర్తి ఉన్నాడా అండి", అని మూర్తి మరదల్ని అడిగితే "మూర్తి గారు" అనలేదు అని ఆమెకు కోపం వచ్చి, "ఓయ్, ఏమిటి? నువ్వేదో బొడ్డు కోసి పేరు పెట్టినట్టు, పేరు పెట్టి పిలుస్తున్నావు?" అంటుంది. ఆ మాట విని ఎన్ని రోజులైందో!
  • చిలిపిదనం: మొత్తం ధారావాహిక అంతా బోల్డంత చిలిపిదనం ఉంది. రాధ, మధు లాంటి యువదంపతుల మధ్యన అది ఉండటం సహజమే, కానీ వెంకట్రావు, జానకమ్మ వంటి వృద్ధదంపుతల మధ్యన కూడా చాలా చిలిపి సందర్భాలు చూపించారు. చూస్తూనే పెదాలపైన చిరునవ్వు వెలియవలసిందే!
 వెఱసి రాధ-మధు ఒక పరిపూర్ణమైన ధారావాహిక అయ్యింది. తీరిక ఉన్నవాళ్ళు తప్పకుండా ఇది చూడాలని నా సలహా.

10 comments:

Niru said...

baavundandi...naku ee serial istam kaani complete ga chudalekapoya..ippudu chusta..thanx for the info

బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ said...

నాక్కూడా ఈ సీరియల్ చాలా ఇష్టం.తెలుగుదనం కనిపిస్తుంది.పాత్రలు ప్రదేశాలు సహజంగా ఉంటాయి

సుజాత వేల్పూరి said...

ఇది యద్దనపూడి సులోచనా రాణి రాసిన గిరిజా కళ్యాణం నవలకు సీరియల్ రూపం! సినిమాగా శోభన్ బాబు, జయప్రద(జూలీ పాత్ర సుమలతో ఎవరో చేశారు) లతో దాసరి తీసినట్టున్నాడు.

నవల్లో రాజేశ్వరి పాత్ర పురుషుడిది.(నాన్నమ్మ కాదు, తాతయ్య).మార్పులు చేర్పులతో అయినా, సీరియల్ బాగా తీశారు. ముఖ్యంగా మధు ఆత్మగౌరవాన్ని, రాధ ఇగోని బాగా చూపించారు. అన్నింట్లోకీ ఆకట్టుకునేది మధు జడ:-))

Tejaswi said...

ఈ సీరియల్ మా టీవీలో వచ్చేటప్పుడు అవకాశం దొరికినప్పుడల్లా చూసేవాడిని. ఎప్పుడూ సీరియల్స్ చూడనివాడిని ఈ సీరియల్ చూడటమేమిటని ఇంట్లో అందరూ ఆశ్చర్యపోయారుకూడా. Mills and Boon కథే అయినప్పటికీ, ట్రీట్ మెంట్ బాగుంది. ముఖ్యంగా సంభాషణలు అద్భుతం. లోతైన అర్ధం స్ఫురించేలాగా, ఆలోచింపచేసేలాగా ఉన్నాయి. ఒకచోట మధు తన తమ్ముడితో అంటుంది, "దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు. అవన్నీ ఇక్కడ(తలను చూపుతూ) పెట్టాడు". Exactగా ఇవే మాటలు అవునో, కాదో కానీ, చాలా అర్ధవంతమైన డైలాగ్.

నటీనటులు కూడా ఆయా క్యారెక్టర్లకు సరిగ్గా సరిపోయారు. ముఖ్యంగా మధు, రాధ.

కొసమెరుపు:ఈ సీరియల్ అంతా మా ఊరిదగ్గరలోని దోనేపూడి(గుంటూరుజిల్లా) అనే గ్రామం, పరిసరప్రాంతాలలో తీశారు.

శిశిర said...

మాటల రచయిత పి. చంద్రశేఖర్ ఆజాద్. ఈ సీరియల్లో ఆయన కూడా నటించారు. మాధవయ్య అనుకుంటాను ఆయన పాత్ర పేరు. రాధ ఇంట్లోంచి బయటకు వచ్చేసినప్పుడు రూం అద్దెకిచ్చి తన కూతురినిచ్చి పెళ్ళి చేద్దామనుకుంటాడు, మధుకి సహాయంగా ఉంటాడు, ఆయనే.

Sandeep P said...

@సుజాత -- ఈ విషయాలు నాకు తెలియనివి. తెలిపినందుకు నెనర్లు :)

@శిశిర - మీరంటున్నది "రాఘవయ్య" గారి గురించి అనుకుంటాను. అది కూడా మంచి పాత్ర. చాలా మంచి సంభాషణలు వ్రాశారు.

ఇందు said...

నేను మొత్తం చూసిన ఏకైక తెలుగు సీరియల్ రాధా-మధు! ఆ సీరియల్ పాట నన్ను ఆకర్షించి ఆ సీరియల్ చూసేలా చేస్తే..రోజురోజుకి అద్భుతంగా సాగిపోయే కధనం విసుగు,చికాకు కలిగించకుండా చేసాయి! అందులో మధు పాత్ర నాకెంత నచ్చిందో! అమ్మాయి అంటే అలా ఉండాలి అనుకునేదాన్ని! :) చాలా చక్కని సీరియల్! మీరు రాసిన విధానం కూడ బాగుంది! అన్ని పాత్రల విశేషాలు బాగా విశదీకరించారు :)

మధురవాణి said...

మీరు రాసిన ఈ పోస్ట్ చూసి నేనూ రాధ-మధు చూసానండీ! నాకూ చాలా నచ్చింది. ఈ సీరియల్ బాగుంటుందని ఇప్పటికే చాలా చోట్ల విన్నాగానీ మీ పోస్ట్ చూసాకనే నాకు వెంటనే చూడాలనిపించింది.. thanks a lot for your post! :)

NAGATEJASWI said...

నాకు రాధ,మధు ఇద్దరూ అంటే పిచ్చి ఇష్టం.
ఇద్దరూ కూడా చాలా బాగా యాక్ట్‌ చేస్తారు.
వాళ్లు అంతబాగా నటించారు కాబట్టే
మధులిక కి రాధమధు సీరియల్ కి గాను నంది అవార్డు వచ్చింది.
ఈ సీరియల్ కి సంబంధించి రాధాక్రిష్ణ కి ఎలాంటి అవార్డు రాలేదు.
(రాధాక్రిష్ణ గారు తనకి అవార్డు వస్తుందనే ఆశించారు.BUT BAD LUCK).

అయితేనేం తాను కష్టపడి నటించిన లయ కి ఈయన నంది అవార్డు పొందారు.

malli ee iddarini kalisi chudali anukuntunna.

ayithe ikkada credit antha
JUSTYELLOW
(SCORPIO) production ki veltundi

srinivas g s said...

TEERAKA LENI VARU KOODA TEERIKA CHESUKONI CHOODALSINA SERIAL ...... RAJESWARI GARI PATRA CHITRANA OKKATI CHALU........ PHD CHEYADANIKI ..... VYAKTITWA VIKASANIKI .....