Sunday, February 11, 2018

దౌష్ట్యముఁ గాంచి భీమునికి దండన సేయగ రాముడెంచె హా!

మొన్న Beaverton, Oregon లో పాలడుగు శ్రీచరణ్ అనే సంస్కృతాంధ్రకవి అష్టావధానం చేశారు. అవధానం జయ హనుమాన్ కోవెలలో జరిగింది. వందమందికి పైగా వచ్చి వీక్షించారు. శ్రీచరణ్ గారు మంచి ధారణా శక్తిని కనబరిచారు. పృచ్ఛకులలో నేనూ ఒకడిని - సమస్యని అందించాను. సమస్యలో జటిలమైన ప్రాసాక్షరం, పురాణలలో కిటుకు కలిపి ఇవ్వాలని తలచి ఈ క్రింది విధంగా ఇచ్చాను.

దౌష్ట్యముఁ గాంచి భీమునికి దండన సేయగ రాముడెంచె హా! 
(దౌష్ట్యము = దుర్మార్గం, కాంచి = చూసి, దండన సేయు = దండించు, ఎంచు = నిర్ణయించు, హా = అయ్యో!)

భీముడు చేసిన దుర్మార్గాన్ని చూసి, రాముడు అతనిని దండించాలని నిర్ణయించుకున్నాడట. అది ఎలాగో ఉత్పలమాలలో చెప్పాలి. శ్రీచరణ్ గారు - ఇబ్బంది లేకుండా పూరించారు. ఆయన పూరణ:

​సృష్ట్యధినాథుడైన పరచిన్మయ విష్ణువు కృష్ణమూర్తియై
వృష్ట్యనృతాంబుదంబు వలె వీరరసంబును నూరిపోయగా
దృష్ట్యవహీనజాతుడగు దిట్టను కూల్చుట కోపభద్రుడై
దౌష్ట్యము గాంచి భీమునికి దండన చేయగ రాముడెంచె హా!


వారి పద్యంలో అన్వయం నాకు పూర్తిగా గోచరించలేదు. "అనృతాంబుదము" అని కృష్ణుడిని అనడం బాగుంది. అంబుదం అంటే మబ్బు. మబ్బులూ, కృష్ణుడూ నల్లగా ఉంటారు (నీలమేఘశ్యాముడు). ఆ కృష్ణుడు కల్లబొల్లి మాటలు చెప్పాడు అండానికి "అనృత + అంబుదం" అన్నారు.

అవధానం రేపనగా ఇది మరీ కష్టమేమోనని కొంచెం సందేహించాను. అదే విషయం నిద్రబోయే ముందు నా సతీమణితో అంటే "మీరు పూరించలేనిది ఆయనని అడగడం సబబా" అంది. సరే, చేతిలో కాగితం, కలం లేకుండా నేను పూరించగలనో లేదొ చూద్దాం అని పూరించాను. దాదాపు 40 నిముషాలు పట్టింది. ఇలాగ పూరించాను.

సృష్ట్యనునిత్యముంగనెడి సాధుకుఁ నీచుకుఁ మధ్య స్పర్థలో
దృష్ట్యనుసారమే తెలియు ర్మమెటో మురవైరియన్నకున్
తుష్ట్యరి కాడె శిష్యుఁ తొడ తుంచిన దుండగుడెవ్వడయ్యినన్ 
దౌష్ట్యముఁ గాంచి భీమునికి దండన సేయగ రాముడెంచె హా!

సృష్టి ఎప్పుడూ మంచివాడికీ, చెడ్డవాడికీ మధ్య తగువును చూస్తూనే ఉంటుంది. అందులో ఎవరివైపు ధర్మముందో చెప్పడం కష్టం. ఎవరి దృష్టిని బట్టి వారికి అలాగ అనిపిస్తుంది. ఇందులో సాక్షాత్ కృష్ణ పరమాత్ముడి అన్న, అవతారమూర్తి అయిన బలరాముడికి కూడా మినహాయింపు లేదు. తన శిష్యుడైన దుర్యోధనుడిని తొడ చీల్చి చంపినవాడు ఎవరైనా తన సంతోషానికి విరోధియే కదా. అందులోనూ భీముడు కూడా బలరాముడి శిష్యుడే. అందుచేత, బలరాముడికి చెడ్డ పేరు వస్తుంది. ఈ దుర్మార్గాన్ని చూసి భీముడిని దండించాలి అని (బల)రాముడు నిర్ణయించుకున్నాడు.

ఒక వేళ ఈ సమస్యతో అనుకోని చిక్కు ఏమైనా వస్తే ఉంటాయి అని మరి కొన్ని సమస్యలను కూడా సిద్ధపరిచాను. అవి మీకు నచ్చి, పూరించాలి అనిపిస్తే - ప్రయత్నించగలరు.

పలువురు మెచ్చెఁ పాలడుగు బాలుడె భామనుఁ గాసిచేయగన్
రావణుఁ నెగ్గియర్జునుడు రాముని వేటుకు నేలకూలెనే
పొట్టేలెంచెను చేప పొందు యెదుటన్ పుష్పాంగి చూస్తుండగా
తామరఁ గని యేవపడని తరుణియుఁ గలదే!
పాడెడి వారి పాలఁ బడి పాలక సైన్యము పారిపోయె హా!